Revanth Reddy: మోదీ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడరని గ్రహించాను.. రాష్ట్రం కోసమే కేంద్ర మంత్రులను కలుస్తున్నాను: బిగ్ డిబేట్‌లో రేవంత్ రెడ్డి

Revanth Reddy praises PM Modi in Big Debate

  • గత పాలకుల తీరుతో మోదీ విసిగిపోయారన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణకు సహకరిస్తామని రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అమిత్ షా హామీ ఇచ్చారన్న రేవంత్ రెడ్డి
  • పార్టీ పరంగా బీజేపీపై పోరాడుతూ... తెలంగాణ కోసం కేంద్రం సహకారం తీసుకుంటానని స్పష్టీకరణ

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడదని తాను ఈ ముప్పై రోజుల్లో గ్రహించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్‌ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ కోసం కేంద్రం సహకారం కోసమే తాను కేంద్రమంత్రులను కలిసినట్లు చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షాను కలిస్తే ఆర్థిక సహకారం కోసం నిర్మలా సీతారామన్‌ను కలవమని చెప్పారన్నారు. తాను నిర్మలమ్మను కలిస్తే నిధుల విషయంలో సానుకూలంగా స్పందించారన్నారు. తనకు కొత్తగా అప్పులు వద్దని... గత ప్రభుత్వం 11 శాతానికి తీసుకున్న అప్పులను 2 శాతానికి మార్చమని కోరానని, దానికి ఆమె వెంటనే అధికారులను ఆదేశించారని చెప్పారు. అలాగే తెలంగాణకు సహకారం ఉంటుందని చెప్పారన్నారు.

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిస్తే అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారని.. తెలంగాణ సీఎంగా యంగ్ స్టర్‌గా తనకు అవకాశం వచ్చిందని మెచ్చుకున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శించేలా చేయగలిగానన్నారు. ప్రతీ దానినీ వారు రాజకీయ కోణంలో చూడరని తనకు ఈ ముప్పై రోజుల పాలనలో మాత్రం అర్థమైందన్నారు. 

తాను పార్టీ పరంగా బీజేపీపై పోరాటం చేస్తానని.. అదే సమయంలో తెలంగాణ కోసం కేంద్రం సహకారం తీసుకుంటానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పడంపై ప్రశ్నించగా... సహకారం ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. అయితే ఇక్కడ గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రధాని మోదీ విసిగిపోయినట్లుగా తనకు కనిపించిందన్నారు. మోదీ ఇక్కడకు వచ్చినా కలవకపోవడం.. అక్కడకు వెళ్లి కలవకపోవడం చూశామన్నారు. కానీ నవీన్ పట్నాయక్ సీఎంగా ఉంటూనే కేంద్రంతో బాగా ఉంటారని గుర్తు చేశారు. తానూ అలా ఉంటానని అభిప్రాయపడ్డారు. తాను పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలపై చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ ముద్ర ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News