ESMA: ‘ఎస్మా’ కు బెదిరేదిలేదన్న అంగన్ వాడీలు

Anganwadies Reaction After ESMA ACT Imposition

  • సమస్యలు పరిష్కరించేదాకా సమ్మె ఆపబోమని వెల్లడి
  • జీతాల పెంపు, గ్రాట్యూటీ కోసం అంగన్ వాడీల పట్టు
  • 26 వ రోజుకు చేరుకున్న నిరవధిక సమ్మె

ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కారు విడుదల చేసిన జీవోపై అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు, న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేంత వరకూ సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు చేస్తున్న సమ్మె శనివారానికి 26 రోజులకు చేరుకుంది. జీతాల పెంపుతో పాటు గ్రాట్యూటీ కోసం వర్కర్లు, హెల్పర్లు పట్టుబడుతున్నారు.

విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మెకు దిగిన అంగన్ వాడీలతో ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపి పలు డిమాండ్లకు ఓకే చెప్పింది. అయితే, మిగతా డిమాండ్లకు ఆమోదం తెలపాలంటూ అంగన్ వాడీలు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా జీతాల పెంపు, గ్రాట్యూటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు.

ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుందంటే..
అత్యవసర సర్వీసులకు చెందిన సిబ్బంది విధులకు గైర్హాజరు కాకుండా ఉండేలా చూసేదే ‘ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటనెన్స్ యాక్ట్’.. ఈ యాక్ట్ ప్రకారం అత్యవసర సర్వీసులైన వైద్యం, ప్రజా రవాణా సర్వీసుల ఉద్యోగులు సమ్మెలు, నిరసనలు చేయడానికి వీలులేదు. దీనిని ఉల్లంఘించిన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ చట్టం ప్రభుత్వానికి కల్పిస్తుంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించే అధికారంతో పాటు అరెస్టు చేయించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది.

సమ్మె చేసిన అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులకు ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు. వీరి సమ్మెకు సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. తాజాగా, ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీలను అత్యవసర సర్వీసులలోకి చేర్చుతూ జీవో విడుదల చేసింది. 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తారని సర్కార్ పేర్కొంది.

ESMA
AP Govt
Anganwadies
Andhra Pradesh
YS Jagan
  • Loading...

More Telugu News