Finland: మంచుగా మారిన మరుగుతున్న వేడి నీళ్లు.. ఫిన్‌లాండ్‌లో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Hot water turning into ice Finland

  • శీతకాలం కావడంతో రికార్డు కనిష్ఠ స్థాయికి దిగజారిన ఉష్ణోగ్రతలు
  • ఓ ఔత్సాహిక పర్యాటకుడు చేసిన ప్రయోగంలో మంచు మేఘంగా మారిన వేడి నీళ్లు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు

శీతాకాలం కావడంతో ఫిన్‌లాండ్‌లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. శీతల వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్న ఓ ఔత్సాహిక పర్యాటకుడు చేసిన ప్రయోగం ఆసక్తికరంగా మారింది. వేడినీటిని గాల్లోకి విసరగా అది మంచు మేఘంగా మారిపోయింది. ఇలా జరగడం కొత్తేమీ కాదు. వాతావరణం అత్యంత చల్లగా ఉన్నప్పుడు ఈ దృగ్విషయం జరుగుతుంది. అయితే దక్షిణ ఫిన్‌లాండ్‌కు చెందిన లారీ ఉంటామో అనే పర్యాటకుడు, తన స్నేహితులతో కలిసి నూతన సంవత్సరం రోజున మైనస్ 30 డిగ్రీల సెల్సియస్‌ (-22 డిగ్రీల ఫారెన్ హీట్) వాతావరణంలో చేసిన ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా, యూట్యూబ్‌ వీడియోలలో చూసిన ట్రిక్‌ను ఇక్కడ ప్రదర్శించానని లారీ ఉంటామో పేర్కొన్నాడు. వేడి నీరు మంచుగా మారిపోవడం సాధ్యమేనని, అయితే మైనస్ 30 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ప్రయోగాలకు అనువు కాదన్నాడు. తన క్యాబిన్‌లో నీళ్లు మరిగించి వెంటనే బయటకు తీసుకొచ్చి గాల్లోకి అర్ధ చంద్రాకారంలో విసిరానని, వెంటనే మంచుతో నిండిన మేఘం ఏర్పడిందని చెప్పాడు. కాగా ఉత్తర యూరప్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లారీ ఉంటామో పర్యటించిన ప్రాంతంలోని ఎనోంటెకియో గత 25 సంవత్సరాలలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 44.3 సెల్సియస్ డిగ్రీలు (-47.74°ఫారెన్‌హిట్) శుక్రవారం నమోదయింది.

More Telugu News