Maddisetty Venugopal: సీఎం కొన్ని సూచనలు చేశారు... నేను కొన్ని అంశాలు చెప్పాను: దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
- వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలకు స్థానచలనం
- నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చుతున్న వైసీపీ హైకమాండ్
- అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు
- తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
వైసీపీలో మరో ఎమ్మెల్యేకి స్థానం చలనం తప్పేలా లేదు! దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. దర్శి నియోజకవర్గ ఇన్చార్జి మార్పు అంశంపై సీఎం జగన్ ఎమ్మెల్యే మద్దిశెట్టితో చర్చించారు.
అనంతరం మద్దిశెట్టి మీడియాతో మాట్లాడుతూ, తనను మరో నియోజకవర్గానికి వెళ్లమంటున్నారని వెల్లడించారు. సీఎం కొన్ని సూచనలు చేశారని, తాను కొన్ని అంశాలు చెప్పానని వివరించారు. ఆలోచించుకుని నిర్ణయం చెప్పమన్నారని మద్దిశెట్టి తెలిపారు. సర్వేల గురించి తనకేమీ చెప్పలేదని అన్నారు.
సీటు గురించి రెండు మూడ్రోజుల్లో చెబుతామన్నారని వెల్లడించారు. రెండు మూడ్రోజుల్లో సీఎంను మరోసారి కలుస్తానని మద్దిశెట్టి పేర్కొన్నారు.
ఇక, జనసేన, ఇతర పార్టీలేవీ తనను సంప్రదించలేదని, తాను కూడా ఏ పార్టీని సంప్రదించలేదని స్పష్టం చేశారు. టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిస్తానని అన్నారు.