MS Dhoni: మాజీ బిజినెస్ పార్టనర్ లపై ధోనీ న్యాయపోరాటం

MS Dhoni files criminal case against a sports management firm

  • గతంలో ఆర్కా స్పోర్ట్స్త్ తో ధోనీ ఒప్పందం
  • దేశవ్యాప్తంగా ధోనీ పేరిట క్రికెట్ అకాడమీలు
  • ఫ్రాంచైజీ ఫీజులు, లాభాల్లో వాటాలు చెల్లించడంలేదంటూ ధోనీ ఆరోపణ
  • ఆర్కా స్పోర్ట్స్ తో ఒప్పందం నుంచి వైదొలగిన వైనం
  • తాజాగా రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు

క్రికెట్ అకాడమీల ఏర్పాటు కోసం ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ సంస్థ 2017లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని పాటించడంలో ఆర్కా స్పోర్ట్స్ నిర్వాహకులు విఫలమయ్యారంటూ ధోనీ న్యాయపోరాటానికి దిగాడు. 

అసలేం జరిగిందంటే... ఒప్పందం ప్రకారం ధోనీ క్రికెట్ అకాడమీ పేరుతో ఆర్కా స్పోర్ట్స్ సంస్థ దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు నెలకొల్పింది. ఒప్పందంలో పేర్కొన్న విధంగా ఫ్రాంచైజీ ఫీజులు, లాభాల్లో వాటాలను ఆర్కా స్పోర్ట్స్ సంస్థ ధోనీకి చెల్లించాలి. కానీ, చెల్లింపుల విషయంలో సదరు సంస్థ ఒప్పందాన్ని తుంగలో తొక్కిందని ధోనీ ఆరోపిస్తున్నాడు. 

ఈ విషయమై ఆర్కా స్పోర్ట్స్ కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్ తో ధోనీ చర్చలు జరిపాడు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ధోనీ ఆ ఒప్పందం నుంచి వైదొలిగాడు. అంతేకాదు, తన తరఫున ఆర్కా స్పోర్ట్స్ సంస్థకు ఇచ్చిన అథారిటీ లెటర్ ను కూడా రద్దు చేసుకున్నాడు. 

చెల్లింపుల విషయమై లీగల్ నోటీసులు పంపినప్పటికీ ఆర్కా స్పోర్ట్స్ నుంచి స్పందన లేకపోవడంతో... తాజాగా ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. దీనిపై ధోనీ న్యాయవాది స్పందించారు. మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్ అనే వ్యక్తులపై క్రిమినల్ కేసు దాఖలు చేశామని, వారు ఒప్పందాన్ని పాటించుకుండా మోసం చేసిన కారణంగా ధోనీకి రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News