Rahul Gandhi: రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర పేరు మారింది!
- గతేడాది భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్
- పలు రాష్టాల్లో గెలిచిన కాంగ్రెస్
- జనవరి 14 నుంచి మరో యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో ఆత్మవిశ్వాసం అందించింది.
ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ మరోసారి జాతీయ యాత్రకు బయల్దేరనున్నారు. తొలుత ఈ యాత్రకు భారత్ న్యాయ్ యాత్ర అని నామకరణం చేశారు. అయితే, ఇప్పుడా యాత్ర పేరు మారింది. రాహుల్ చేపట్టే ఈ రెండో విడత యాత్రకు 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'గా పేరు మార్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు.
ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలోనే రాహుల్ గాంధీ యాత్ర పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారని జైరాం రమేశ్ తెలిపారు. 'భారత్ జోడో న్యాయ్' యాత్ర జనవరి 14న ప్రారంభమవుతుందని, మార్చి 30న ముగుస్తుందని వివరించారు.
ఇందులో భాగంగా రాహుల్ గాంధీ 6,713 కిలోమీటర్లు యాత్ర చేస్తారు. 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 66 రోజులు కొనసాగనుంది. 15 రాష్ట్రాల్లో 100 లోక్ సభ స్థానాల పరిధిలో ఈ యాత్ర జరగనుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి మొదలై మహారాష్ట్రలో ముగియనుంది.
అయితే, 'భారత్ జోడో యాత్ర'కు భిన్నంగా, ఈసారి రాహుల్ ఎక్కువగా బస్సు ద్వారా యాత్ర చేస్తారని తెలుస్తోంది.