Chandrababu: ఇలా చూస్తూ కూర్చుంటే ఏమీ మిగలదు..చంద్రబాబు హెచ్చరిక

Chandrababu laments at the current status of ap under ycp rule

  • జగన్ పాలనపై అగ్గిమీద గుగ్గిలమైన చంద్రబాబు
  • మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగం
  • రాష్ట్రంలో ఎక్కడ చూసినా దందాలు, దోపిడీలేనంటూ ఆగ్రహం

జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా దందాలు, దోపిడీలేనని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. బాధ్యత గలవారందరూ ప్రస్తుత పరిస్థితిపై ఆలోచించాలన్నారు. 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా దందాలు..దోపిడీలే
జగన్ సీఎం అయ్యాక రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశారు.. 75 ఏళ్లుగా అభివృద్ధి చేసిన వ్యవస్థలను జగన్ విధ్వంసం చేశాడు. రాష్ట్రంలో రోడ్లు, వ్యవసాయం, విద్య, వైద్యం అన్నీ దెబ్బతిన్నాయి. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై ఎవరు మాట్లాడినా దాడులు చేసి కేసులు పెట్టారు. ఎక్కడ చూసినా దందాలు, దోపిడీలే. ప్రజలు అసహ్యించుకుంటుంటే జగన్ కొత్తగా ఆలోచించి ఎమ్మెల్యేలను మార్చుతున్నాడు. పరిశ్రమలు తరిమేశాడు. రోడ్లన్నీ పాడైపోయాయి. ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదు..విపరీతంగా అప్పులు చేశాడు. ఇష్టారీతిన అవినీతి చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. జగన్ రాజకీయాలను అపవిత్రం చేశాడు. మంచి, చెడుకు తేడా తెలియని వ్యక్తి జగన్. రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలోకి నెట్టారు. వ్యవస్థలు సక్రమంగా ఉండి..నడిపించే వ్యక్తులు సమర్థులుగా ఉంటే దాని ఫలితాలు సామాన్యులకు దక్కుతాయి. 

టీడీపీ ప్రవేశపెట్టిన వంద సంక్షేమ పథకాలు రద్దు..
స్కూలు బిల్డింగులకు రంగులు వేయడం అభివృద్ధికాదు...చదువుకున్న విద్యార్థి మేథావి అయి, మంచి ఉద్యోగం సాధిస్తే అది నిజమైన అభివృద్ది. పైపైన రంగులు దుద్ది అదే అభివృద్ధి అని చెప్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ కూడా ఇచ్చింది..మేం ప్రవేశపెట్టిన 100 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.  స్కాలర్ షిప్ లు టీడీపీ హయాంలో 16 లక్షల మందికి ఇస్తే..దానికి విద్యా దీవెన అని పేరు పెట్టి 10 లక్షలకు కుదించి బటన్ నొక్కుతూ సొంత పత్రికకు ప్రకటనలిచ్చుకుంటున్నాడు. చదువుకోవాలనుకునే ప్రతి విద్యార్థికీ విదేశాల్లోనూ చదువుకునే అవకాశం కల్పిస్తేనే నిజమైన విద్యాభివృద్ధి..అదే టీడీపీ చేసి చూపింది. విదేశీ విద్య కింద ఒక్కో విద్యార్థికి రూ.15 లక్షలు ఆర్థిక సాయం అందించాం. భయంకరంగా జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. నా జీవితంలో ఇంతలా మార్పులు వినలేదు..చూడలేదు. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి..జవాబుదారీ తనం తీసుకురావడానికి. ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజల్ని లీడ్ చేయాలి. పుచ్చలపల్లి సుందరయ్యను ప్రజలు ఇప్పుడూ గుర్తుంచుకుంటున్నారు. 

చూసుకుంటూ కూర్చుంటే రాష్ట్రంలో ఏమీ మిగలదు..
రాష్ట్రంలో పండిన గంజాయి పక్క రాష్ట్రాలకు వెళ్లడంతో వాళ్లూ ఏపీని తిడుతున్నారు. బాధ్యత కలిగిన నాయకులందరూ ఆలోచించాలి. మనం చూసుకుంటూ కూర్చుంటే రాష్ట్రంలో ఏమీ మిగలదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ నెల 5వ తేదీ నుండి రా..కదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రజలకు ఏమి చేస్తానో చెప్పేందుకు 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తా. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంగన్వాడీ, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, గురుకులాల సిబ్బంది రోడ్లపైకి వస్తే వాళ్లని బెదిరిస్తున్నారు. న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేస్తే సమర్థిస్తాం..వాటిని పరిష్కరించేందుకు ముందుకొస్తాం’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News