Mallu Bhatti Vikramarka: ప్రయాణికులపై ఛార్జీ భారం మోపవద్దు: టీఎస్ ఆర్టీసీ అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సూచన

Mallu Bhatti Vikramarka review with TSRTC officials

  • మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణించారన్న మల్లు భట్టి
  • టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరఫున సహకారం ఉంటుందని హామీ
  • నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు

ప్రయాణికులపై ఛార్జీ భారం మోపకుండా ఆర్టీసీని బలోపేతం చేయాల్సి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సచివాలయంలో టీఎస్ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మల్లు భట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రయాణికులపై ఛార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంపై ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణించినట్లు తెలిపారు. ఈ పథకాన్ని ఇలాగే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు.. సంస్థ అప్పులు.. పీఎఫ్, సీసీఎస్ ఇతర సెటిల్మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ఈ సందర్భంగా అధికారులు.. టీఎస్ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మహాలక్ష్మి పథకం కింద రోజుకు సగటున 27 లక్షల మంది మహిళలు బస్సులలో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ.10 కోట్ల వరకు విలువైన జీరో టిక్కెట్లను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆలోచన చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టిక్కెట్ ఆదాయం మాత్రమే కాకుండా లాజిస్టిక్స్, కమర్షియల్ వంటి మార్గాల్లో ఆదాయంపై సంస్థ దృష్టి పెట్టిందని పొన్నం అన్నారు.

  • Loading...

More Telugu News