Chandrababu: నేను పులివెందులకు నీళ్లు ఇచ్చా... కానీ జగన్ కుప్పంపై శీతకన్నేశారు: చంద్రబాబు

Chandrababu questions CM Jagan why did YCP govt neglected Kuppam

  • కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • శాంతిపురం రోడ్ షోలో ప్రసంగం
  • టీడీపీ పాలనలో కుప్పం ఎంతో అభివృద్ధి సాధించిందని వెల్లడి
  • వైసీపీ పాలనలో కుప్పం సర్వనాశనం అయిందని ఆవేదన

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. శాంతిపురంలో ఆయన ప్రసంగిస్తూ, కుప్పం నియోజకవర్గంపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో కుప్పం ఎంతో అభివృద్ధి సాధించిందని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంపై శీతకన్నేశారని విమర్శించారు. 

వైసీపీ పాలనలో కుప్పం సర్వనాశనం అయిందని... గూండాయిజం, భూకబ్జాలు, గ్రానైట్ అక్రమ దందాలు తప్ప కుప్పంకు వైసీపీ ప్రభుత్వం ఏంచేసిందో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. కుప్పం అంటే మీకెందుకంత పగ? అని ప్రశ్నించారు. 

తాము అధికారంలో ఉండుంటే ఈ ప్రాంతానికి హంద్రీనీవా కింద ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చేవాళ్లమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డామని తెలిపారు. తాము 87 శాతం పనులు పూర్తి చేశామని, అంతలోనే ఎన్నికలు వచ్చాయని వివరించారు. కానీ మిగతా 13 శాతం పనులు పూర్తిచేయలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. 

ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఆనాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తానని చెప్పి, మాట నిలబెట్టుకున్నానని చంద్రబాబు ఉద్ఘాటించారు. నేను పులివెందుల కోసం అంత చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News