Prajapalana: ప్రజాపాలన అప్లికేషన్లు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటాం: జీహెచ్ఎంసీ కమిషనర్
- అప్లికేషన్ ఫామ్స్ ని రూ. 60కి అమ్ముతున్నారని రాజాసింగ్ ఆరోపణ
- అప్లికేషన్ ఫామ్స్ ను ఉచితంగా ఇస్తామన్న రొనాల్డ్ రాస్
- దరఖాస్తులకు కొరత లేదని వెల్లడి
మీసేవ కేంద్రాల్లో ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ లను రూ. 60కి విక్రయిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. వేలాది మంది ప్రజలు దరఖాస్తుల కోసం వస్తుంటే ఒక్కో మీసేవ సెంటర్ లో కేవలం వంద మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారని ఆయన మండిపడ్డారు. నెల రోజుల పాటు ప్రాజాపాలన కార్యక్రమాన్ని పొడిగించాలని డిమాండ్ చేశారు. అప్లికేషన్ ఫామ్స్ ను ఎక్కువ ధరకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ స్పందించారు. అప్లికేషన్లను అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. అప్లికేషన్ ఫామ్స్ ను ఉచితంగా ఇస్తామని చెప్పారు. పటాన్ చెరులో ఒక్కో అప్లికేషన్ ఫామ్ ను రూ. 20 చొప్పున అమ్మిన మీసేవ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారని తెలిపారు.