Jeevan Reddy: లక్ష కోట్లలో రూ.50వేల కోట్ల అవినీతి జరిగింది: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan reddy on Kaleswaram Project
  • కుట్రపూరితంగా ఖజానాను ఖాళీ చేశారని ఆరోపణ
  • ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కాలంలో ఆనకట్ట కుంగిపోవడం... తలదించుకునే పరిస్థితని విమర్శ 
  • వేరే సంస్థతో విచారణ జరిపించాలన్న జీవన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, కానీ అందులో రూ.50వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం కుట్రపూరితంగా ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రాణహిత పనులు గతంలో కాంగ్రెస్ హయాంలోనే మూడొంతులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దానిని పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ కాలంలో ఆనకట్ట కుంగిపోవడం ద్వారా ప్రపంచంలో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై అధికారులు... ఇంజినీర్ల సమాధానాలపై ఆధారపడకుండా వేరే సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జ్యూడిషియల్ విచారణ కోసం వేచి చూడవద్దని సూచించారు. అసలు రెండో టీఎంసీ పనులు పూర్తి కాకముందే మూడో టీఎంసీకి ఏమి అవసరం వచ్చింది? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా కట్టారని ఆరోపించారు. పెన్ గంగను వదిలేసి వార్దాపై ఆనకట్టను ఎలా ప్రతిపాదించారు? అని ప్రశ్నించారు.
Jeevan Reddy
Telangana
Congress
BRS

More Telugu News