Nara Lokesh: లక్ష ఓట్ల మెజారిటీతో లోకేశ్ ను గెలిపించుకుంటాం!: విస్తృతస్థాయి సమావేశంలో మంగళగిరి నేతల ప్రతిన

Mangalagiri TDP leaders pledged they will gifts victory to Nara Lokesh with one lakh votes majority

  • మంగళగిరిలో నారా లోకేశ్ పర్యటన
  • నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి లోకేశ్ హాజరు
  • లోకేశ్ కు విజయాన్ని కానుకగా అందిస్తామన్న మంగళగిరి నేతలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకునేలా యావత్ మంగళగిరి టీడీపీ కేడర్ కలసికట్టుగా సంకల్పించాలని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య పిలుపునిచ్చారు. ఇవాళ తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో అబద్దయ్య మాట్లాడుతూ... గత ఎన్నికల్లో లోకేశ్ ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని సొంత నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 27 సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని వెల్లడించారు. నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం లోకేశ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

"2014-19వరకు  చంద్రబాబు పరిపాలన చూశాం, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో బాబు పాలన చూశాం. సంక్షేమంతోపాటు అనేక పరిశ్రమలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేశారు, రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పలు నిర్మాణాలు చేపట్టారు. లోకేశ్ పంచాయతీ, ఐటీ శాఖ మంత్రిగా పలు పరిశ్రమలు తేవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల కి.మీ.ల రోడ్లు నిర్మించారు" అని అబద్దయ్య వివరించారు.

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ... యువగళం ద్వారా రాష్ట్రప్రజలకు నేనున్నానని భరోసా నిచ్చిన నారా లోకేశ్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకునేందుకు నియోజకవర్గంలోని కేడర్ అంతా రాబోయే 100 రోజులు కష్టపడి పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. మనం రాక్షసుడితో పోరాడుతున్నాం, కలిసికట్టుగా యుద్ధం చేయాల్సి ఉందని చెప్పారు. 

గుంటూరు పార్లమెంటు స్థానం ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ... యువనేత లోకేశ్ ప్రజాగళాన్ని యువగళంగా రాష్ట్రవ్యాప్తంగా విన్పించారని తెలిపారు. 

"ఎన్నికల్లోగా అన్ని నియోజకవర్గాలు చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. మనందరం కలసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ తగ్గకుండా గెలిపించుకుని, ఆయనకు బహుమతిగా ఇద్దాం, ఇందుకోసం ప్రతి కార్యకర్తా ప్రతినబూనాలి. గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ అనేక మోసపూరిత వాగ్దానాలతో అన్ని వర్గాల ప్రజలను  మోసగించాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అమరావతిని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో లక్ష ఓట్ల మెజారిటీ సాధించేవరకు ఎవరూ విశ్రమించవద్దు. రాష్ట్రంలో 160 పైచిలుకు స్థానాల్లో మనం గెలవబోతున్నాం" అని పోతినేని పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో మంగళగిరి నియోజకవర్గ పార్టీ నాయకులు, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన బాధ్యులు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News