Telangana: మూలుగ బొక్క కోసం గొడవ..నిశ్చితార్థం తరువాత రద్దైన పెళ్లి
- మెట్పల్లి మండలం వరుడికి నిజామాబాద్ యువతితో పెళ్లి నిశ్చియం
- నవంబర్ 1న యువతి ఇంట్లో నిశ్చితార్థం, విందు
- భోజనాల సందర్భంగా వరుడి బంధువులు మూలుగ బొక్క కోరడంతో వివాదం
- పోలీసుల వద్దకు చేరిన పంచాయితీ, చివరకు పెళ్లి రద్దు
ఆ వధూవరులు ఒకరికొకరు నచ్చారు. ఇరు కుటుంబాల మద్య కట్నకానుకలు కూడా కుదిరాయి. ఇక ముహూర్తమే మిగిలుందనుకుంటున్న తరుణంలో ఆ పెళ్లి అకస్మాత్తుగా రద్దైపోయింది. నిశ్చితార్థం వేడుకలో మూలుగ బొక్క కారణంగా తలెత్తిన వివాదంతో ఇరు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చియమైంది. నవంబర్ 1న నిశ్చితార్థం సందర్భంగా అమ్మాయి ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో వధువు బంధువులతో వివాదం తలెత్తింది. ఈ పంచాయితీ చివరకు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. దీంతో, ఒకరితో మరొకరికి పొసగదన్న నిర్ణయానికి వచ్చిన వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో, ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది.