KTR: రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ 'స్వేదపత్రం' పవర్ పాయింట్ ప్రజంటేషన్

KTR to releases sweda patram power point presentation

  • తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమన్న కేటీఆర్
  •  పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించమని వ్యాఖ్య
  • స్వేద‌ప‌త్రం' పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌కు బీఆర్ఎస్ సర్వం సిద్ధం చేసిందన్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని, పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పాల‌న‌లో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ప‌ల్లె ప్ర‌గ‌తి నుంచి మొదలు టీఎస్ ఐపాస్ వ‌ర‌కు ప్ర‌తి ప‌థ‌కం.. అనేక అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల‌ను అందించిందన్నారు. దీంతో ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల రూపురేఖ‌లు మారిపోయాయన్నారు.

అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వ‌ర‌కు ఎంతో ప్ర‌యోజ‌నం జరిగిందని, అంత గొప్ప‌గా ప్ర‌జా పాల‌న సాగించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలిపారు. తొమ్మిదిన్న‌రేళ్ల పాల‌న‌పై 'స్వేద‌ప‌త్రం' పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌కు బీఆర్ఎస్ సర్వం సిద్ధం చేసిందని, తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు తాను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇస్తానని ఎక్స్ వేదికగా ప్రకటించారు. గణాంకాలతో వాస్తవ ముఖచిత్రాన్ని వివరిస్తామన్నారు. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు స్వేద పత్రం విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News