Punjab Kings: పొరపాటున ఒక ఆటగాడి బదులు మరో ఆటగాడ్ని కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Punjab Kings bought one player instead of another by mistake

  • డిసెంబరు 19న దుబాయ్ లో ఐపీఎల్ వేలం
  • తన్మయ్ త్యాగరాజన్ అనే ఆటగాడ్ని కొనాలని భావించిన పంజాబ్
  • కానీ తన్మయ్ అనుకుని శశాంక్ సింగ్ ను కొనేసిన వైనం
  • ఒకసారి కొనుగోలు జరిగాక వెనక్కి తీసుకోలేమన్న వేలం నిర్వాహకురాలు
  • శశాంక్ తో పాటు తన్మయ్ ని కూడా కొనేసిన పంజాబ్ కింగ్స్

దుబాయ్ లో నిన్న ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలం జరిగింది. కొద్ది సంఖ్యలోనే ఆటగాళ్లు వేలంలోకి వచ్చినప్పటికీ, రికార్డులు బద్దలయ్యేలా కొనుగోళ్లు జరిగాయి. అయితే, ఇదే వేలంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక ఆటగాడి బదులు మరో ఆటగాడ్ని కొని నాలుక్కరుచుకుంది. 

అసలేం జరిగిందంటే... వేలం నిర్వహిస్తున్న మల్లికా సాగర్ వరుసగా ఆటగాళ్ల పేర్లు చదువుతూ వేలం పాట కొనసాగించారు. ఈ క్రమంలో చత్తీస్ గఢ్ ఆటగాడు శశాంక్ సింగ్ పేరును చదివారు. అతడి కనీస ధర రూ.20 లక్షలు అని మల్లికా సాగర్ ప్రకటించారు. అయితే అతడిని కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంచైజీలు ఏవీ ఆసక్తి చూపలేదు. 

ఇంతలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ శశాంక్ సింగ్ ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కనీస ధర రూ.20 లక్షలకే కొనేసింది. ఆ తర్వాత మల్లికా సాగర్... మరో ఆటగాడు తన్మయ్ త్యాగరాజన్ పేరును చదివారు. అప్పటికి గానీ తాము చేసిన పొరపాటు ఏంటో పంజాబ్ కింగ్స్ కు అర్థం కాలేదు. 

వాస్తవానికి వారు కొనాలని ప్రణాళిక రూపొందించుకుంది తన్మయ్ త్యాగరాజన్ కోసం. కానీ అంతకుముందు వేలంలోకి వచ్చిన శశాంక్ సింగ్ ను తన్మయ్ త్యాగరాజన్ అనుకుని కొనేశారు. 

శశాంక్ సింగ్ విషయంలో తాము పొరబడ్డామని గుర్తించిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యం వెంటనే ఆ విషయాన్ని వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆమె ఒక్కసారి కొనుగోలు జరిగాక దాన్ని వెనక్కి తీసుకోవడం జరగదని స్పష్టం చేయడంతో, చేసేదిలేక పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తన్మయ్ త్యాగరాజన్ ను కూడా కొనుగోలు చేసింది. అతడిని కూడా కనీస ధర రూ.20 లక్షలకే కొనుగోలు చేయడం పంజాబ్ కింగ్స్ కు కాస్త ఊరట కలిగించే విషయం. 

అసలుకు కొసరు అన్నట్టుగా శశాంక్ సింగ్ కూడా పంజాబ్ కింగ్స్ జట్టులో ఒకడయ్యాడు. 

కాగా, వేలంలో తాము పొరబడిన విషయాన్ని పంజాబ్ కింగ్స్ వేలంలో ప్రకటించడం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News