gangula kamalakar: వంద రోజులు వేచి చూస్తాం... మేం రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గంగుల హెచ్చరిక

Gangula warning to Revanth Reddy government

  • ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే నిరసన తప్పదన్న గంగుల
  • వరుసగా తనను నాలుగుసార్లు గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని వ్యాఖ్య 
  • పోరాటాలు బీఆర్ఎస్‌కు కొత్త కాదన్న మాజీ మంత్రి

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు వందరోజుల వరకు వేచిచూస్తామని... ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిరసన తప్పదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్... రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... కరీంనగర్ చరిత్రలో లేని విధంగా వరుసగా నాలుగుసార్లు గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తన చివరి క్షణం వరకూ ప్రజల కోసమే పని చేస్తానని వ్యాఖ్యానించారు. పదిహేనేళ్ల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కరీంనగర్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. 

వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి.. వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షం ఉండాలని.. జవాబుదారీగా పని చేయాలని.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడతామని తెలిపారు. పోరాటాలు బీఆర్ఎస్‌కు కొత్త కాదని... తాము రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవద్దని సూచించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

More Telugu News