- శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఘటన
- గమ్యం చేరుకునే వరకు అదే పనిగా అసభ్య ప్రవర్తన
- ర్యాపిడోకు ఫిర్యాదు చేస్తే తనను అదోరకంగా చూశారని ఆవేదన
- ఆ తర్వాత వందసార్లు క్షమాపణలు చెప్పారన్న బాధిత మహిళ
- డ్రైవర్‌ను సస్పెండ్ చేశామని చెబుతున్నా నమ్మలేమన్న బాధితురాలు
బెంగళూరులో మహిళా రైడర్‌పై ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో టిన్ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు బాధిత మహిళ సోషల్ మీడియా పోస్టు ద్వారా పేర్కొంది. తన ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉందని, కాబట్టి ఆమె ఫోన్‌లో నేవిగేట్ చేయమని ర్యాపిడో డ్రైవర్ ఆమెను కోరాడు. దీంతో ఆమె తన ఫోన్ ఇవ్వడంతో అతడు స్టాండ్‌లో పెట్టి మ్యాప్‌లు చూడాలని చెప్పాడు. ఆ తర్వాత ఆమెతో మాటలు కలుపుతూ.. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు? వంటి వివరాలు ఆరా తీశాడు. చాలామంది డ్రైవర్లు ఇలా కబుర్లు చెబుతారు కాబట్టి ఆమె కూడా అది మామూలేనని అతడి ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
ఆ తర్వాత ఓ పెట్రోలు బంక్ వద్ద పెట్రోలు నింపుకున్న తర్వాతి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ‘‘నేను కూర్చున్న తర్వాత వెనక సీటు కింద తాళం ఉందని చెబుతూ, దానిని తీసుకోవడానికి నా తొడలను రెండుసార్లు తాకాడు. నేను భయపడిపోయి భయ్యా అన్నాను. ఆ తర్వాత తన తొడలను చాపాలని చెబుతూ దగ్గరగా ఆనుకుని కూర్చున్నాడు. దీంతో నేను హడలిపోయాను. ఆ తర్వాత చాలా అసభ్యంగా తాకుతూ చాలా ఇబ్బంది పెట్టాడు. ఏం జరుగుతుందోనని భయపడ్డాను. ఆ భయంతో అతడు ఏం చేస్తున్నాడో కూడా అడగలేకపోయాను. రద్దీగా ఉన్న ప్రాంతానికి చేరుకునే వరకు అంటే.. దాదాపు 20 నిమిషాలపాటు అతడి వేధింపులు భరించాల్సి వచ్చింది. గమ్యం చేరుకునే వరకు దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నా. అతడిని చెంపదెబ్బ కొట్టే ధైర్యం నాలో లేకపోయింది. అతడు ఉద్దేశపూర్వకంగానే అలా ప్రవర్తించాడు’’ అని ఆమె వివరంగా రాసుకొచ్చింది.
ఆ తర్వాత కూడా అతడి వేధింపులు కొనసాగాయని, తను చేరుకోవాల్సిన గమ్యస్థానం మరో రెండుమూడు కిలోమీటర్ల దూరం ఉండడంతో తన ఫోన్‌ను తిరిగి ఇవ్వమని అడిగినట్టు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత ఏడెనిమిది నిమిషాలు అతడు మాట్లాడలేదని, చివరికి ఇంటికి చేరుకోవడంతో కష్టాలు గట్టెక్కాయని ఊపిరిపీల్చుకున్నానని తెలిపింది. తాను చాలాకాలంగా ర్యాపిడోను ఉపయోగిస్తున్నా ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని తెలిపింది.
తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ర్యాపిడోకు ఫిర్యాదు చేసింది. అయితే, విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని కంపెనీ పేర్కొందని ఆమె తెలిపింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. వారు తనను ఓ ‘వేశ్య’లా చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ తర్వాత వారు తనకు ‘వందసార్లు’ క్షమాపణలు చెప్పారని, డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారని పేర్కొంది. తనను వేధింపులకు గురిచేసిన వ్యక్తి వివరాలు అందించమని తాను వారిని అడిగానని, కానీ వారు పేరు మాత్రమే చెప్పగలమన్నారని పేర్కొంది. బైక్ నంబర్ అడిగినా వారు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వారు డ్రైవర్‌ను సస్పెండ్ చేశామని చెబుతున్నా అందుకు తగిన రుజువులు లేవని ఆ సుదీర్ఘ పోస్టులో పేర్కొంది.