Mexico: మెక్సికోలో దారుణం.. దుండగుడి కాల్పుల్లో 16 మంది మృతి

16 people were killed in gumman firing in Mexico
  • క్రిస్మస్ పార్టీ నుంచి వస్తున్నవారిపై కాల్పులు జరిపిన దుండగుడు
  • ఈవెంట్ హాల్ నుంచి బయటకు వస్తుండగా తుపాకీతో కాల్పులు
  • ఆదివారం తెల్లవారుజామున సాల్వాటియెర్రా పట్టణంలో చోటుచేసుకున్న దారుణం
మెక్సికోలో కాల్పుల మోత మోగింది. గువానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ సీజన్ పార్టీ నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్నవారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 మంది మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ‘పోసాడా’ అని పిలిచే క్రిస్మస్ పార్టీ తర్వాత ఈవెంట్ హాల్ నుంచి జనాలు బయటకు వస్తున్న సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా మెక్సికోలోని సలామాంకా నగరంలో జరిగిన మరో కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.

ఇదిలావుంచితే.. మెక్సికో రాజధాని మెక్సికో సిటీకి నైరుతి దిశలో 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్స్‌కల్‌టిట్లాన్ గ్రామంలో చోటుచేసుకున్న ఘర్షణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయుధులు, క్రిమినల్ గ్యాంగ్, స్థానికుల మధ్య ఘర్షణతో అక్కడ హింస చెలరేగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. వేట కొడవళ్లు, వేట తుపాకీలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
Mexico
gumman
firing

More Telugu News