Nagababu: ఈసారి సాక్షాత్తు దేవుడే దిగివచ్చి పోటీ చేసినా 175కి 175 గెలవడం అసాధ్యం: నాగబాబు

Nagababu attends Janasena meeting

  • నెల్లూరు జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశం
  • హాజరైన నాగబాబు
  • వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు

ఇవాళ జనసేన పార్టీ నెల్లూరు రూరల్, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక వైసీపీ ప్రభుత్వం వంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రాష్ట్రంలోనూ చూడలేదని అన్నారు. 

ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎలా తిట్టాలో సకల శాఖల మంత్రి సజ్జల స్క్రిప్టు ఇస్తారని, ఆ స్క్రిప్టును ఫాలో అవుతూ ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు విపక్ష నేతలను నోటికొచ్చినట్టు తిడతారని వివరించారు.

ఒక మంత్రేమో పథకాలు ముఖ్యమా, రోడ్లు ముఖ్యమా అంటాడు, మరో మంత్రేమో ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుద్యోగం పెరిగిందని అంటాడు... ఇంకొక మంత్రి ఏకంగా కోర్టుల్లోనే దొంగతనం చేయిస్తాడు... ఇలాంటి వారు మంత్రులు అయితే ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదని నాగబాబు స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి వై నాట్ 175 అంటున్నారని, ఈసారి ఎన్నికల్లో సాక్షాత్తు దేవుడే దిగివచ్చి పోటీ చేసినా 175కి 175 గెలవడం అసాధ్యమని అన్నారు. వైసీపీ ఒక రాక్షస గణం అని, ఈసారి కూడా ఆ పార్టీ గెలిస్తే సగం రాష్ట్రం ఖాళీ అయిపోతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడకపోతే వైసీపీని గద్దె దించలేమని నాగబాబు అభిప్రాయపడ్డారు. 

ఎన్నికలకు ఇక 100 రోజుల సమయం మాత్రమే ఉందని, ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలన్నదానిపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇక, ఈసారి ఎన్నికల్లోనూ తాను ఎంపీగా పోటీ చేస్తానని ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని నాగబాబు స్పష్టం చేశారు. తనకు పదవులపై ఆసక్తి లేదని అన్నారు.

  • Loading...

More Telugu News