Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్న పోలీసులు.. గన్‌పార్క్ జంక్షన్ ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్!

Hyderabad Police Ready To Check Traffic Problems
  • నాంపల్లి, లక్డీకాపూల్ వైపు నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ కష్టాలకు చెక్
  • నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించే చర్యలు
  • సీఎం వెళ్లే దారిలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా గ్రీన్ చానల్ ఏర్పాటు యోచన
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను కడతేర్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. సీఎం, మంత్రుల కాన్వాయ్ వెళ్లే సచివాలయం, అసెంబ్లీ, బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి రూట్లను పరిశీలిస్తున్నారు. సాధారణ ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా కాన్వాయ్ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ముందున్న గన్‌పార్క్ జంక్షన్‌ను సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా మార్చారు. దీంతో ఇప్పుడు నాంపల్లి, లక్డీకాపూల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా, సిగ్నల్ ఇబ్బందులు లేకుండా దూసుకుపోనున్నాయి.

అలాగే, బషీర్‌బాగ్ నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ చేశారు. అటువైపు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద మలుపు తీసుకుని ఏఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో యూటర్న్ తీసుకోనున్నాయి. ఈ కారణంగా ఇప్పుడు పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ ముందు ట్రాఫిక్ రద్దీకి అవకాశం ఉండదు. ఈ ట్రయల్ రన్ కనుక మంచి ఫలితాలు ఇస్తే దీనిని కొనసాగిస్తారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లోనూ సిగ్నల్ ఫ్రీ సిస్టంను అమలు చేస్తున్నారు.

జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో బేగంపేట పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో సందర్శకుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు సికింద్రాబాద్, పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు ఇబ్బందులు లేకుండా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, సీఎం వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Hyderabad Traffic
Gunpark
Assembly Junction

More Telugu News