Revanth Reddy: ఆ పని చేసుంటే కేసీఆర్‌ కు సీఎం స్థానంలో కూర్చునే అవకాశం దక్కేది: రేవంత్ రెడ్డి ధ్వజం

Revanth Reddy fires at KCR in Assembly

  • ప్రగతి భవన్‌లోకి రానివ్వలేదని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారన్న రేవంత్
  • బీఆర్ఎస్ వైఖరి మార్చుకోకుంటే... ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారని వ్యాఖ్య
  • ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు చేరువ చేశామన్న సీఎం
  • తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవారు ప్రతిపక్షంలో కూర్చున్నారన్న సీఎం
  • పేద రైతులకు ఎకరాకు రూ.1960 రాగా.. కేసీఆర్ ఫామ్ హౌస్ వడ్లకు రూ.4250 వచ్చాయని విమర్శ

గతంలో అలంపూర్ ప్రాంతంలో వరద నీటిలో ఇళ్లు నష్టపోయిన సందర్భంలో.. ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి.. మీకు న్యాయం చేస్తానని, అవసరమైతే నంది నగర్‌లోని తన ఇంటిని అమ్మి అయినా మీకు ఇళ్లు కట్టిస్తానని చెప్పారు.. మీ ఇల్లు అవసరం లేదు కానీ... వారికి ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఉంటే ఇవాళ మీకు (కేసీఆర్) ఇక్కడ (ముఖ్యమంత్రి స్థానంలో) నిలబడి మాట్లాడే అవకాశం వచ్చేది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం శాస‌న‌స‌భ‌లో గ‌వర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకు ప్రగతి భవన్‌లోకి ప్రవేశం కల్పించలేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినిని పిలిపించి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అని సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో మండిపడ్డారు.

సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుతో ప్రజలు వారిని ఓడించారని, ఇంకా వారు వైఖరిని మార్చుకోకుంటే ప్రజలు వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చిందన్నారు. ఎంతోమంది సీనియర్లు ఉన్నా... వారిని బీఆర్ఎస్ పట్టించుకోలేదని.. కొడుకు, అల్లుడు, కూతురుకు పదవులు కట్టబెట్టారన్నారు. అందుకే ప్రజలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు.

ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుపకంచెలను బద్దలు కొట్టి ప్రజలకు చేరువ చేసిన ప్రభుత్వం తమదే అన్నారు. ప్రగతి భవన్ ముందు తాను గంటలపాటు నిలుచుకున్నా అనుమతించలేదని గద్దరన్న చెప్పారని గుర్తు చేసుకున్నారు. రైతులు సహా ఎవరికీ ఏమీ చేయలేదన్నారు. ఇవన్నీ గ్రహించే ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవారు అక్కడ (ప్రతిపక్షంలో) కూర్చున్నారని విమర్శించారు. 

నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ రెడ్డిల సభ్యత్వాలను అన్యాయంగా రద్దు చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి ఘటనలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు. తాము ఇచ్చిన హామీలలో రెండింటిని నెరవేర్చామని, మిగతా వాటిని త్వరలో నెరవేరుస్తామని స్పష్టం చేశారు. హామీలకు చట్టబద్ధత కల్పించి.. సభ ద్వారా అమలు చేస్తామన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాలకు భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వారికి కండువా కప్పగానే పదవులు ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి కోటి ఎకరాలకు నిజంగానే సాగునీరు ఇస్తే కనుక మోటార్లు తగ్గాలి కానీ.. ఎందుకు పెరిగాయి? అని ప్రశ్నించారు.

తెలంగాణ మాజీ సీఎం కుటుంబ సభ్యులపై ఉన్న కేసులు ఎన్ని? తెలంగాణ ఉద్యమకారులపై కేసులను సమీక్షించారా? అని నిలదీశారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పండిన వడ్లకు క్వింటాలుకు రూ.4250 ఇస్తే... పేద రైతులకు క్వింటాల్‌కు రూ.1960 మాత్రమే ఇచ్చారని, దీనిపై అవసరమైతే విచారణకు సిద్ధమని సవాల్ చేశారు. తొలుత వరి భేష్ అని.. ఆ తర్వాత వరి వేస్తే ఉరి అని రైతులను గందరగోళపరిచారన్నారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో అదే వరి ఎలా వేశారు? అని ప్రశ్నించరు. 

ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ... ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ప్రభుత్వమని రేవంత్ వ్యాఖ్యానించారు. తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో బీఆర్ఎస్ పాత్ర లేదా? అని ప్రశ్నించారు. కాగా రేవంత్ మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదేపదే అడ్డు తగిలారు.

  • Loading...

More Telugu News