Chandrababu: 151 మందిని మార్చినా ఈసారి వైసీపీ గెలవదు: చంద్రబాబు

Chandrababu says YCP can not win elections either they change 151 candidates

  • జనవరి నుంచి సైకిల్ స్పీడు పెరుగుతుందన్న చంద్రబాబు
  • జగన్ చెప్పింది ఒక్కటి కూడా చేయడని విమర్శలు
  • ఈ నాలుగున్నరేళ్లలో జగన్ చేసిందేమీ లేదని వ్యాఖ్యలు
  • సైకో జగన్ ను చిత్తుగా ఓడిస్తేనే ఏపీకి భవిష్యత్తు అని కామెంట్   

టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి నుంచి సైకిల్ స్పీడు మరింత పెరుగుతుందని అన్నారు. సైకిల్ స్పీడుకు ఫ్యాన్ ఆగిపోతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ నావకు చిల్లు పడింది... మునిగిపోవడం ఖాయం... బయటపడే పరిస్థితే లేదు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఏపీలో ఎక్కడ చూసినా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని, జగన్ అన్ని సంప్రదాయాలను సర్వనాశనం చేశారని విమర్శించారు. సీఎం జగన్ ఏనాడైనా నేరుగా ప్రజలను కలిశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నాలుగున్నరేళ్లలో జగన్ చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని వ్యాఖ్యానించారు. 

సీఎం జగన్ ఎన్నికలకు ముందు చెప్పింది ఏమిటి... ఇప్పుడు చేసింది ఏమిటి? అని నిలదీశారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు... తెచ్చాడా? అని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచలేదు కానీ, కేంద్రం వద్ద తాను మెడలు దించాడు అని విమర్శించారు. జగన్ మాటలు కోటలు దాటాయి కానీ చేతలు గడప కూడా దాటడం లేదు అని అన్నారు. 

జగన్ ఒక అపరిచితుడు అని, చెప్పంది ఒక్కటి కూడా చేయడని చంద్రబాబు పేర్కొన్నారు. ఆఖరికి తల్లికి, చెల్లికి కూడా జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారని మండిపడ్డారు. 

ఇక, టీడీపీ అధికారంలో ఉండుంటే 2020 నాటికే పోలవరం పూర్తయ్యేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ వైసీపీ పాలనలో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయని స్పష్టం చేశారు. టీడీపీ చేపట్టిన పట్టిసీమ నీళ్లు వాడకుండా జాతికి ద్రోహం తలపెట్టారని మండిపడ్డారు. 

జగన్ పాలనలో పేదల జీవన ప్రమాణాలు పెరిగాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలను బలోపేతం చేస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో 24 శాతం నిరుద్యోగం ఉందని వెల్లడించారు. అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్ వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

ఏపీని కాపాడేందుకే టీడీపీ, జనసేన కలిసి వస్తున్నాయని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో 151 మందిని మార్చినా వైసీపీ గెలవదని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఏపీలో ఎవరికీ ధైర్యంగా మాట్లాడే స్వేచ్ఛ లేదని, రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు అది ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుందని ప్రశ్నించారు. 

ఈ నెల 20 తర్వాత 25 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చంద్రబాబు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో ఏంచేస్తామనేది తానే స్వయంగా చెబుతానని అన్నారు. సైకో జగన్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తేనే ఏపీకి భవిష్యత్తు అని అన్నారు.

  • Loading...

More Telugu News