Hardik Pandya: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా ముగిసిన రోహిత్ శర్మ శకం... కొత్త సారథిగా హార్దిక్ పాండ్యా
- గత కొన్ని సీజన్లుగా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్న ముంబయి
- ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసిన వైనం
- ఇప్పుడు ఏకంగా కెప్టెన్ గా నియమిస్తూ ముంబయి ఇండియన్స్ ప్రకటన
మొన్న ఐపీఎల్ ఆటగాళ్ల ట్రేడింగ్ సమయంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.15 కోట్లు చెల్లించి మరీ గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ఎందుకు కొనుగోలు చేసిందో ఇప్పుడర్థమవుతోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లో తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటూ ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ శకం ముగిసినట్టయింది.
ముంబయి జట్టుకు రికార్డు స్థాయిలో 5 ఐపీఎల్ టైటిళ్లు అందించిన ఘన చరిత్ర రోహిత్ సొంతం. అయితే కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ప్రదర్శన దిగజారుతూ వస్తోంది. ఈ కారణంగానే హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్ గా నియమించినట్టు తెలుస్తోంది.
పాండ్యా... ముంబయి ఇండియన్స్ కు కొత్తేమీ కాదు. ఏడు సీజన్ల పాటు ముంబయికి ఆడాడు. అయితే, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ లో అరంగేట్రం చేస్తూ హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసి కెప్టెన్ ను చేసింది. తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ కు కప్ అందించి పాండ్యా తన సత్తా నిరూపించుకున్నాడు. తర్వాతి సీజన్ లోనూ గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.
పాండ్యా సామర్థ్యంపై నమ్మకంతోనే ముంబయి ఇండియన్స్ కోట్లు వెచ్చించి మరీ అతడిని తిరిగి తీసుకొచ్చింది. దీనిపై ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పందిస్తూ... జట్టును భవిష్యత్ కోసం సిద్ధం చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ గ్లోబల్ పెర్ఫార్మెన్స్ హెడ్ మహేల జయవర్ధనే ఓ ప్రకటన చేశారు.
"ముంబయి ఇండియన్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాల కోసం జట్టును నిర్మించే క్రమంలో ఇదొక భాగం. ముంబయి ఇండియన్స్ జట్టుకు మొదటి నుంచి మెరుగైన నాయకత్వం లభిస్తోంది. సచిన్ టెండూల్కర్ నుంచి హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ వరకు ప్రతి ఒక్కరూ విజయాలు అందించారు. అంతేకాదు, జట్టును బలోపేతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ ఆలోచనా సరళిలో భాగంగానే హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం జరిగింది. హార్దిక్ పాండ్యా 2024 ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు" అని వెల్లడించారు.
"ఇక రోహిత్ శర్మ అమోఘమైన నాయకత్వం పట్ల ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2013 నుంచి ముంబయి ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ప్రస్థానం ఎంతమాత్రం తీసివేయదగ్గది కాదు... రోహిత్ శర్మ సారథ్యం ఎంతో ఘనంగా సాగింది. రోహిత్ నాయకత్వం ముంబయి ఇండియన్స్ కు అసమాన విజయాలను అందించడమే కాదు, అతడిని ఐపీఎల్ చరిత్రలో సర్వోత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిపింది.
రోహిత్ మార్గదర్శకత్వంలో ముంబయి ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదగడమే కాదు, అత్యంత అభిమాన జట్టుగా క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోతుంది. ముంబయి ఇండియన్స్ జట్టును మైదానంలోనూ, వెలుపలా మరింత బలోపేతం చేసేందుకు మున్ముందు కూడా రోహిత్ మార్గదర్శకత్వం, అతడి అనుభవం జట్టుకు కావాలి" అని జయవర్ధనే ఓ ప్రకటనలో వివరించారు.
కాగా, రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో విజేతగా నిలిచింది. అయితే, 2021 సీజన్ లో 5వ స్థానంలో నిలచిన ముంబయి ఇండియన్స్, 2022లో 10వ స్థానంలో సరిపెట్టుకుంది. 2023లో మూడో స్థానంలో నిలిచింది.