MS Dhoni: ధోనీపై ఫిక్సింగ్ ఆరోపణల వ్యవహారంలో ఐపీఎస్ అధికారికి 15 రోజుల జైలుశిక్ష
- 2013లో ఐపీఎల్ లో ఫిక్సింగ్, బెట్టింగ్ కలకలం
- ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ నేతృత్వంలో విచారణ
- తనపై సంపత్ కుమార్ ఓ టీవీ చానల్లో అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ధోనీ
- టీవీ చానల్ పైనా, సంపత్ కుమార్ పైనా రూ.100 కోట్లకు పరువునష్టం దావా
ఐపీఎల్ లో 2013 సీజన్ సమయంలో ఫిక్సింగ్, బెట్టింగ్ కలకలం రేగడం తెలిసిందే. తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల నిషేధం కూడా విధించారు. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.
అయితే సంపత్ కుమార్ కొందరు బుకీల నుంచి లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ అధికారిని కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పించిన ఉన్నతాధికారులు, విధుల నుంచి సస్పెండ్ చేశారు. బుకీల నుంచి సంపత్ కుమార్ లంచం తీసుకున్నట్టు ఆధారాలు లేవంటూ ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ఐపీఎస్ అధికారికి ఊరట కలిగింది.
కానీ, ఆ ఐపీఎస్ అధికారి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ధోనీ మద్రాస్ హైకోర్టు ఆశ్రయించాడు. ఓ టీవీ చానల్లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ధోనీ కోర్టుకు వివరించాడు. ఆ మేరకు సదరు టీవీ చానల్ పైనా, ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పైనా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. అంతేకాదు, తాను అడిగే 17 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
ధోనీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు... వివరణ ఇవ్వాలంటూ టీవీ చానల్ ను, ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ ను ఆదేశించింది. అయితే టీవీ చానల్ ఇచ్చిన వివరణపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ధోనీ వంటి ప్రముఖ క్రికెటర్ పై ఏదైనా వార్తలు ప్రసారం చేసే ముందు వాటిని నిర్ధారణ చేసుకోవాలని సదరు టీవీ చానల్ కు మొట్టికాయలు వేసింది.
అటు, ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ వివరణ ధోనీ ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. పైగా ఆయన ఇచ్చిన వివరణలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ధోనీ మద్రాస్ హైకోర్టుకు విన్నవించాడు. ధోనీ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే అతడు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజులు నిలుపుదల చేసింది.