Kadiam Srihari: గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏముంది?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Kadiyam Srihari on Governor speech

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడం ఏమిటి? అన్న శ్రీహరి  
  • 2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని వ్యాఖ్య 
  • గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని విమర్శ  

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లుగా ఉందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు. గవర్నర్ గతంలో మాట్లాడింది.. ఇప్పుడు మాట్లాడింది ఓసారి సమీక్షించుకోవాలని సూచించారు. గత పదేళ్లుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నట్లు గవర్నర్ ప్రసంగంలో ఉందని, కానీ జాతీయస్థాయిలో మన రాష్ట్రం ఎన్నో అవార్డులు అందుకున్న విషయం గవర్నర్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ వరి ఉత్పత్తిలో ముందు నిలిచిందని వ్యాఖ్యానించారు.

త‌లసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని, ఐటీ ఉత్పత్తులు, ఎగుమ‌తుల్లో హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడే సంతోషపడుతున్నట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛవాయువులు పీలుస్తుంటే... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే సంతోషంగా ఉన్నారని చెప్పడం ఏమిటి? అని నిలదీశారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింద‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్ప‌డాన్ని కడియం తప్పుబట్టారు. మెడలు వంచి తెలంగాణ సాధించామని, కానీ గవర్నర్ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని, ఇప్పుడు కావడం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు గవర్నర్ తన ప్రసంగంలో ఎలాంటి ప్రణాళికనూ ప్రకటించలేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఓ రూట్ మ్యాప్ ఉండాల్సిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం... గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో దళిత బంధు ప్రస్తావన లేదని, రూ.500 మద్దతు ధర అంశం లేదన్నారు. చూస్తుంటే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలపై తమ నుంచి సరైన సమాధానం ఉంటుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News