Smitha sabarwal: కొత్త చాలెంజ్ లకు సిద్దమంటూ స్మిత సబర్వాల్ ట్వీట్
- కేంద్ర సర్వీసుల్లోకి వెళతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్
- ఇప్పటి వరకూ సీఎం రేవంత్ రెడ్డిని కలవని స్మిత సబర్వాల్
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు వారం రోజులు కావొస్తున్నా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ ముఖ్యమంత్రిని కలుసుకోలేదు. ప్రభుత్వం మారిన సందర్భంలో పాలనాధికారులు కొత్త ముఖ్యమంత్రిని కలవడం ఆనవాయితీ.. అయితే, స్మిత సబర్వాల్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. నీటి పారుదల శాఖపై సీఎం జరిపిన సమీక్షకు కూడా ఆమె హాజరుకాకపోవడం సర్వత్రా చర్చకు దారితీసింది. తాజాగా, కొత్త చాలెంజ్ లకు సిద్ధమంటూ స్మిత సబర్వాల్ ఓ ట్వీట్ చేయడం కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. స్మిత కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని, ఇప్పటికే ఈమేరకు దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం పనులను పర్యవేక్షించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. 2001లో ట్రైనీ కలెక్టర్ ఐఏఎస్ విధుల్లో చేరిన స్మిత సబర్వాల్.. మెదక్ జిల్లా కలెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఆరోపించారు. ఈ అక్రమాలలో అధికారులకూ వాటా ఉందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కొత్త ప్రభుత్వానికి దూరంగా ఉంటోందనే వాదన వినిపిస్తోంది.