India: గాజాలో తక్షణ కాల్పుల విరమణ తీర్మానానికి అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు

India Votes In Favour to Gaza Ceasefire at UNO

  • గాజాలో మానవతావాద సాయం కోరుతూ ఐరాస ముందుకు కీలక తీర్మానం
  • స్పాన్సర్ చేసిన ఇరాక్, కువైట్, సౌదీఅరేబియా సహా అనేక దేశాలు
  • వ్యతిరేకంగా ఓటు వేసిన అమెరికా, ఇజ్రాయెల్‌ సహా 10 దేశాలు

తక్షణ మానవతావాద సాయం కోసం గాజాలో ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు. అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, పాలస్తీనాతోపాటు అనేక దేశాలు స్పాన్సర్ చేసిన ఈ తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ముసాయిదా తీర్మానంలో హమాస్‌ను ప్రస్తావించకపోవడంపై అమెరికా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తప్పుబట్టాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హేయమైన ఉగ్రవాద దాడులను ఖండించాలని, బందీల విడుదలను పేర్కొంటూ తీర్మానానికి సవరణ చేయాలని డిమాండ్ చేశాయి. జనరల్ అసెంబ్లీ నుంచి వెలువడిన శక్తిమంతమైన సందేశం పరంగా ఇదొక చారిత్రాత్మకమైన రోజు అని ఐరాసలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ వ్యాఖ్యానించారు. 

తీవ్ర మానవీయ సంక్షోభం: భారత్

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడిందని, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోందని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. స్త్రీలు, పిల్లల ప్రాణనష్టం అధికంగా ఉందన్నారు. జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసిందని అన్నారు. ఈ తీర్మానంలో అనేక కోణాలు ఉన్నాయని, హమాస్ చెరలో బందీల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని రుచిరా కాంబోజ్ పేర్కొన్నారు.

India
Gaza Ceasefire
UNO
USA
Israel
Hamas
  • Loading...

More Telugu News