India vs South Africa: రెండో టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం

South Africa Beat India By 5 Wickets in 2nd t20

  • డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆతిథ్య జట్టు గెలుపు
  • లక్ష్య ఛేదనలో కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్క్రమ్, హెండ్రిక్స్
  • 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రింకూ సింగ్ ఇన్నింగ్స్ వృథా

దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన రెండవ టీ20 మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది. రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్ వృథాగా పోగా.. లక్ష్య ఛేదన చివరిలో చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్క్రమ్, హెండ్రిక్స్ ఆతిథ్య జట్టును విజయ తీరాలకు చేర్చారు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లకు 152 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు 5 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలోనే ఛేదించారు.

దక్షిణాఫ్రికా బ్యాటర్లను భారత్ బౌలర్లు నియంత్రించలేకపోయారు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి 5 ఓవర్లలో 36 పరుగులు అవసరమైన సమయంలో మిల్లర్‌ (17), స్టబ్స్‌(14 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత మిల్లర్ ఔట్ అయినా ఫెలుక్వాయో, స్టబ్స్‌ మిగతా పనిని పూర్తి చేశారు. దీంతో 39 బంతుల్లోనే 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రింకూ సింగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి భారత్ భారీ స్కోరు చేయకుండా నియంత్రించడంలో కీలక పాత్ర పోషించిన షంసి (1/18)కి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో వెనుకబడింది. మొదటి మ్యాచ్ వర్షం కారణం రద్దయ్యింది. ఇక చివరి టీ20 మ్యాచ్ గురువారం జరగనుంది.

రింకూ సింగ్‌ (68 నాటౌట్), సూర్యకుమార్‌ యాదవ్‌ (56) భారత ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. కోయెట్జీ 3 కీలకమైన వికెట్లు, మార్కో యెన్సెన్, విలియమ్స్, షంసీ, మార్క్రమ్ తలో వికెట్ తీశారు. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెండ్రిక్స్‌ (49), మార్‌క్రమ్‌ (30 చెలరేగి ఆడారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. అర్షదీప్ సింగ్ కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి 31 పరుగులు సమర్పించుకున్నాడు. ముకేశ్ కుమార్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ మాత్రమే తీశారు.

India vs South Africa
T20 series
Cricket
Team India
  • Loading...

More Telugu News