Hyderabad: హైదరాబాద్ నగరం మరోసారి 'ది బెస్ట్' గా నిలిచింది: కేటీఆర్

KTR says once again Hyderabad stood as the best city
  • ఉత్తమ నగరాల జాబితా విడుదల చేసిన కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ 
  • హైదరాబాదుకు 153వ స్థానం
  • భారత్ లో హైదరాబాదే నెంబర్ వన్... తర్వాత స్థానాల్లో పూణే, బెంగళూరు
  • హైదరాబాద్ ఈ ఘనత సాధించడం ఆరోసారి అని కేటీఆర్ వెల్లడి
అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ, ఆర్థిక సేవల సంస్థ 'మెర్సర్' తాజాగా ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాదుకు 153వ స్థానం దక్కగా, పూణే 154వ స్థానంలోనూ, బెంగళూరు 156వ స్థానంలోనూ ఉన్నాయి. భారత్ నుంచి ఈ మూడు నగరాలకే 'మెర్సర్' జాబితాలో చోటు లభించింది. 

దీనిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భారత్ లో మరోసారి హైదరాబాద్ నగరమే ది బెస్ట్ సిటీగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 2015 నుంచి భారత్ లో అత్యుత్తమ నగరంగా నిలవడం హైదరాబాద్ కు ఇది ఆరోసారి అని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాదీలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.  

కాగా, మెర్సర్ జాబితాలో చెన్నై 161వ స్థానంలో ఉండగా... ముంబయి 164, కోల్ కతా 170, ఢిల్లీ 172వ ర్యాంకును పొందాయి. ఇక, ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవన ప్రమాణాల పరంగా అత్యుత్తమ నగరం అని 'మెర్సర్' పేర్కొంది. వియన్నాకు నెంబర్ వన్ ర్యాంకును కేటాయించింది. 

ఈ జాబితాలో స్విట్జర్లాండ్ నగరం జ్యూరిచ్ కు రెండో స్థానం, న్యూజిలాండ్ నగరం ఆక్లాండ్ కు మూడో స్థానం లభించాయి. 

అత్యంత దారుణమైన నగరాలుగా ఎన్ జమేనా (చాద్), బెంగుయి (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్), ఖర్టూమ్ (సూడాన్) ర్యాంకింగ్ లో అట్టడుగున నిలిచాయి.
Hyderabad
Best City
Mercer
KTR
BRS
Telangana

More Telugu News