Amit Shah: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పుతో నిరూపితమైంది: అమిత్ షా
- ఆర్టికల్ 370 శాశ్వతం కాదన్న సుప్రీంకోర్టు
- ఆర్టికల్ 370 రద్దు చేయడం సబబేనని నేడు తీర్పు
- సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు తీసుకువచ్చిన ఆర్టికల్ 370 తాత్కాలికమైనదని, ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబేనని సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
"2019 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ముందుచూపుతో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ లో శాంతి నెలకొని, మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు హింసతో చితికిపోయిన కశ్మీర్ లోయలో ఇప్పుడు మానవ జీవితానికి కొత్త అర్థం చెప్పేలా అభివృద్ధి జరుగుతోంది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పర్యాటకం, వ్యవసాయ పరంగా ఎంతో పురోగతి చోటు చేసుకోవడం ద్వారా స్థానికుల ఆదాయం కూడా పెరిగింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతో నిరూపితమైంది" అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.