Allu Arjun: హృదయాలు కరిగించేశావు బేబీ కియారా... ఇక చాలమ్మా!: అల్లు అర్జున్

Allu Arjun review on Hi Nanna movie

  • నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా నటించిన చిత్రం హాయ్ నాన్న
  • శౌర్యువ్ దర్శకత్వంలో చిత్రం
  • హాయ్ నాన్న చిత్రం వీక్షించిన అల్లు అర్జున్
  • చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ పోస్టు

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హాయ్ నాన్న చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను వీక్షించిన అనంతరం అల్లు అర్జున్ తన స్పందనను సోషల్ మీడియా ద్వారా వెలిబుచ్చారు. 

"హాయ్ నాన్న చిత్రబృందానికి అభినందనలు. ఈ సినిమా ఎంతో బాగుంది. నిజంగా హృదయానికి హత్తుకుంది. సోదరుడు నాని ఎంతో అలవోకగా నటించేశాడు. ఇంత మంచి స్క్రిప్టును తెరకెక్కించినందుకు చిత్రబృందం పట్ల గౌరవం కలుగుతోంది. ప్రియమైన మృణాల్... తెరపై నీ నటనా మాధుర్యం వెంటాడుతుందనడంలో సందేహం లేదు. నీలాగే నీ నటన కూడా రమణీయంగా ఉంది. 

బేబీ కియారా... నా డార్లింగ్... నీ ముద్దు ముద్దు మాటలతో హృదయాలు కరిగించేశావు తల్లీ... ఇక చాలమ్మా... స్కూలుకు వెళ్లు! ఇతర నటీనటులందరికీ, ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ కు కూడా అభినందనలు. 

దర్శకుడు శౌర్యువ్ గారూ... కంగ్రాచ్యులేషన్స్. దర్శకుడిగా మీ తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. మీరు ఈ చిత్రంలో చూపించిన అనేక సన్నివేశాలు హృదయాన్ని తాకాయి, మరికొన్ని సీన్లు కంటతడి పెట్టించాయి. కథను అద్భుతంగా తెరకెక్కించారు. మీరిలాగే ఎదగాలని కోరుకుంటున్నాను. 

ప్రేక్షకులకు ఇంతటి కమ్మని చిత్రాన్ని అందించినందుకు నిర్మాతలకు అభినందనలు. హాయ్ నాన్న చిత్రం కేవలం తండ్రులనే కాదు, ప్రతి కుటుంబ సభ్యుడి మనసును హత్తుకుంటుంది" అంటూ అల్లు అర్జున్ వివరించారు.

More Telugu News