Mallu Bhatti Vikramarka: రెండ్రోజుల్లో రెండు గ్యారెంటీలు అమలు చేశాం... బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేమంటారు?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఖమ్మం వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- భట్టి, తుమ్మల, పొంగులేటిలకు ఖమ్మంలో ఘనస్వాగతం
- తాము గ్యారెంటీలను అమలు చేయడం బీఆర్ఎస్ నేతలకు చెంప పెట్టు వంటిదన్న భట్టి
- మిగిలిన 4 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని స్పష్టీకరణ
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఖమ్మంలో సందడి చేశారు. మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండ్రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసిందని చెప్పారు.
ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పించామని, ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచామని భట్టి వివరించారు. ఈ రెండు గ్యారెంటీలను తాము అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే అమలు చేయడం బీఆర్ఎస్ నేతలకు చెంప పెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గ్యారెంటీలకు వారంటీ లేదన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని భట్టి నిలదీశారు. మిగిలిన గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం సంపద సృష్టించి, ప్రజలకు పంపిణీ చేయడమేనని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు, పోడు భూముల అంశాలను కూడా వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.