Balineni Srinivasa Reddy: సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని... వీడియో ఇదిగో!

Balineni sensational comments

  • ఒంగోలులో ఓ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి బాలినేని
  • తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాశానని వెల్లడి
  • కుమారుడు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో విరమించుకున్నట్టు వివరణ
  • తాను మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నానంటూ వ్యాఖ్యలు
  • డబ్బులు తీసుకోకుండా రాజకీయాలు నడపలేనని స్పష్టీకరణ

ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా తాను కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాశానని, కానీ తన కుమారుడు ప్రణీత్ రెడ్డి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో ఆ పందెం రద్దు చేసుకున్నానని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే, ఏపీలో వైసీపీ గెలుస్తుందని తన కుమారుడు అంచనా వేశాడని... వైసీపీ అన్నా, జగన్ అన్నా తన కుమారుడికి అంత అభిమానం అని బాలినేని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు తెలిసి కూడా, కుమారుడు చెప్పడంతో పందెం విరమించుకున్నానని వివరించారు. అక్కడి ఓటర్ల మనోభావాలు తెలుసుకునేందుకు తన కుమారుడు తెలంగాణ అంతా తిరిగొచ్చాడని వివరించారు.  జగన్ అంటే నాకు చాలా అభిమానం ఉంది... కానీ ఆయనకు కూడా ఉండాలి కదా అని బాలినేని వ్యాఖ్యానించారు. 

ఇక, వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మీరందరూ మద్దతు ఇస్తే కచ్చితంగా ఇక్కడ్నించే బరిలో దిగుతా... మీరు మద్దతు ఇవ్వనంటే అసలు పోటీయే చేయను అంటూ తన మద్దతుదారులకు తేల్చిచెప్పారు. 

అంతేకాదు "నేను నీతిమంతుడ్ని అని, ఎక్కడా డబ్బులు తీసుకోలేదు అని చెప్పను. అయితే ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా తప్పు చేయలేదు. మంత్రిగా ఉన్నప్పుడు బయటి వాళ్లు ఇస్తే తీసుకున్నాను. డబ్బులు తీసుకోకుండా నేను ఈ రాజకీయాలు నడపలేను" అని వెల్లడించారు.

Balineni Srinivasa Reddy
YSRCP
Ongole
Andhra Pradesh

More Telugu News