Vijayashanti: కేసీఆర్ గారూ.. మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే: విజయశాంతి
- కాంగ్రెస్ ప్రభుత్వం నిలవదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారన్న విజయశాంతి
- ఈ మాటలను వెనక నుంచి కేసీఆరే చెప్పిస్తున్నారని విమర్శ
- ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి చెప్పాలని డిమాండ్
కేసీఆర్ ను కలిసి బయటకొస్తున్న కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండదని... మళ్లీ మేమే వస్తాం అని మాట్లాడుతున్నారని, వారితో కేసీఆర్ అలా మాట్లాడిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. అధికార స్వార్థం, అహంకారం, దోపిడీ, దుర్మార్గ నియంతృత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్య పరిణామాలను సహజంగా వ్యతిరేకిస్తాయని అన్నారు.
ఈ ఒకనాటి టీఆర్‌ఎస్‌కు 2014లో 63 స్థానాలు వచ్చాయని... ఇప్పటి కాంగ్రెస్ కన్నా అవి తక్కువ స్థానాలని విజయశాంతి చెప్పారు. ఆ టీఆర్ఎస్... ఇప్పటి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించినప్పుడు, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నడవదని ప్రశ్నించారు. అంటే, బీఆర్ఎస్ నేతల ప్రకటన వెనుక... ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య హననానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరుగుతున్న ప్రయత్నానికి, ఆ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు, వారి వెనుకున్న కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి తప్పక సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ గారూ... మీరు ప్రజాస్వామ్యవాది అయినట్టయితే మీ పార్టీ నేతలు చేసిన పై ప్రకటన తప్పు అని చెప్పండి... మీపై ఆ బాధ్యత ఉంది అని చెప్పారు. మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వస్తున్నారనే వదంతులను తప్పించుకోవడానికి మీరు ఇలా చెప్పిస్తున్నారని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.