Uttam Kumar Reddy: సీఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం పూర్తికాలేదు... వేచి చూస్తున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy talks about chief minister post
  • అధిష్ఠానానికి చెప్పాల్సింది చెప్పానన్న ఉత్తమ్  
  • తాను ఏడుసార్లు గెలిచానని.. ఎప్పుడూ పార్టీని వీడలేదని వ్యాఖ్య
  • తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్‌పై అంత వ్యతిరేకత లేదన్న ఉత్తమ్
తాను మొదటి నుంచి పార్టీ పెద్దలతోనే ఉన్నానని... తాను అధిష్ఠానానికి చెప్పాల్సింది చెప్పానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం ఎన్టీవీ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఉన్న సమాచారం మేరకు ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నిర్ణయం పూర్తి కాలేదని, ఎవరో ఒకరి పేరుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, పార్టీని ఎప్పుడూ వీడలేదని, పార్టీని వదిలి బయటకు వెళ్లలేదన్నారు.

తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్‌పై అంత వ్యతిరేకత లేదని, కానీ ఆ తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈ కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. ప్రతి ఎన్నికకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయన్నారు. అయితే 70 సీట్లలో గెలుస్తామని భావించామని, కానీ 64 సీట్లలోనే గెలిచామని, ఇది బాధించిందన్నారు. తాను పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీకి వచ్చానని చెప్పారు. పార్టీ పెద్దలకు చెప్పాల్సింది చెప్పానని, నిర్ణయం కోసం చూస్తున్నట్లు తెలిపారు. తాను, తన భార్య ఎప్పుడూ క్షేత్రస్థాయిలో ఉంటామన్నారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ముఖ్యమంత్రి విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో తాను పీసీసీ అధ్యక్షుడిని కాదు కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేదన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతలను మాత్రం సమర్థవంతంగా నిర్వర్తించినట్లు చెప్పారు.
Uttam Kumar Reddy
Revanth Reddy
Telangana Assembly Results
Congress

More Telugu News