Jithender Reddy: బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే తెలంగాణలో బీజేపీ గెలిచి ఉండేది: జితేందర్ రెడ్డి
- ఇప్పటికైనా బండి సంజయ్‌ని అధ్యక్షుడిగా చేస్తే లోక్ సభలో బీజేపీ 10 సీట్లు గెలుస్తుందని వ్యాఖ్య
- కేసీఆర్ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. అందుకే బీఆర్ఎస్ను ఇంటికి పంపించాలని ఫిక్స్ అయ్యారన్న జితేందర్ రెడ్డి
- బండి సంజయ్‌ని తొలగించడంతో ప్రజలు క్రమంగా కాంగ్రెస్ వైపు మళ్లారని వ్యాఖ్య
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని, ఇప్పటికైనా బండి సంజయ్‌ని తిరిగి అధ్యక్షునిగా చేస్తే రాబోయే మూడు నాలుగు నెలలలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లను బీజేపీ తప్పకుండా గెలుస్తుందని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఒకసారి బీజేపీకి అధికారం వచ్చేవరకు బండి సంజయ్‌నే రాష్ట్ర అధ్యక్షునిగా ఉంచుదామని సూచించారు. బీజేపీకి తెలంగాణలో హైప్‌ను తీసుకువచ్చింది ఆయనే అన్నారు. కేసీఆర్ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బీఆర్ఎస్ను ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నారని, కానీ బండి సంజయ్‌ని తొలగించడంతో ప్రజలు క్రమంగా కాంగ్రెస్ వైపు మరలినట్లు చెప్పారు. తొలుత బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయమని భావించారని, బండి సంజయ్ తొలగింపు తర్వాత కాంగ్రెస్ వైపు చూశారన్నారు.