Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్: తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనదారులకు ఆంక్షలు

TTD imposes restrictions on bikers in ghat roads
  • ఏపీ దక్షిణ కోస్తా జిల్లాలపై మిగ్జామ్ తుపాను ప్రభావం
  • ఈదురుగాలులతో భారీ వర్షాలు
  • కొండచరియలు విరిగిపడతాయని ఆందోళన చెందుతున్న టీటీడీ
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను 'మిగ్జామ్' నెల్లూరు, తిరుపతి జిల్లాలపై అత్యధిక ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోనూ భారీ వర్షాలు కురిశాయి. 

ఈ నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనదారులకు ఆంక్షలు విధించింది. రేపు (డిసెంబరు 6) ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఘాట్ రోడ్లపై ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కొండచరియలు విరిగిపడడం, పొగమంచు వల్ల రహదారి కనిపించకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు  జరిగే అవకాశం ఉంటుందని టీటీడీ ఆందోళన చెందుతోంది. 

తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు కూడా వీస్తుండడంతో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 

వరద ముంపు నేపథ్యంలో అధికారులు పెన్నా నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అనంతసాగరం, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాల్లో గిరిజనులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 

కాగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలు నేడు, రేపు సెలవు ప్రకటించాయి. కృష్ణా జిల్లాపైనా మిగ్జామ్ తుపాను ప్రభావం పడింది. దాంతో జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు ఉంటుందని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
Cyclone Michaung
Tirumala
Ghat Roads
TTD
Tirupati Districts
Andhra Pradesh

More Telugu News