Cyclone Michaung: నెల్లూరుకు 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం
- ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం
- రేపటికి తుపానుగా మారే అవకాశం
- ఏపీ తీరానికి చేరువగా వస్తున్న తుపాను
- కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ తుపానుగా బలపడనుంది. ఇది తుపానుగా మారాక ఏపీ తీరం వెంబడే పయనిస్తూ డిసెంబరు 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది.
డిసెంబరు 3 నుంచి 6 వరకు ఏపీ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. డిసెంబరు 4, 5 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు 2 నుంచి 4 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, డిసెంబరు 3న కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. కోస్తా జిల్లాల్లో 70 కి.మీ నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.