Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్
- నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఈ నెల 29 రాత్రి ఉద్రిక్తతలు
- ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వాడివేడి వాతావరణం
- చొరవ తీసుకుని సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం
- డ్యామ్ పై యథాతథ స్థితి ఉంటుందన్న కేంద్ర హోంశాఖ
నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్రం స్పందించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ వర్గాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. సాగర్ డ్యామ్ వివాదంపై ఈ సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి... ఏపీ, తెలంగాణ సీఎస్ లు, డీజీపీలు... సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ అధికారులు హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఉభయ తెలుగు రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు.
సాగర్ డ్యాంపై యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొన్నారు. నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితే కొనసాగుతుందని అన్నారు. డ్యామ్ ప్రస్తుతం సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. డ్యామ్ నిర్వహణ కేఆర్ఎంబీ చూసుకుంటుందని భల్లా వెల్లడించారు. కేంద్రం ప్రతిపాదనలకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి.