Special Trains: తెలుగు రాష్ట్రాల మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఈ నెలాఖరు వరకు పొడిగింపు
- ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నిర్ణయం
- కాకినాడ-లింగంపల్లి రైలు నేటి నుంచి 29 వరకు పొడిగింపు
- హైదరాబాద్-నర్సాపూర్ రైలు రేపటి నుంచి 30 వరకు అందుబాటులో
- తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య కూడా నడవనున్న ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07481) 3వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.
హైదరాబాద్-నర్సాపూర్ (07631) రైలు రేపటి నుంచి ఈ నెల 30 వరకు ప్రతి శనివారం, తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07332) ఎల్లుండి (3వ తేదీ) నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. కాకినాడ-లింగంపల్లి (07445) రైలు నేటి నుంచి 29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, తిరుగు ప్రయాణంలో రేపటి నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే, తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య కూడా రెండు జతల ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.