Cyclone Michaung: ఏపీకి తుఫాను ముప్పు..ఐఎండీ హెచ్చరిక

Cyclone Michaung rain forecast for coastal districts in ap

  • బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుపానుగా బలపడనున్న వైనం
  • డిసెంబర్ 3-5 తేదీల్లో కోస్తా ఆంధ్రకు సమీపంగా అల్పపీడనం
  • నేటి నుంచి మూడు-నాలుగు రోజుల పాటు రాయలసీమలోనూ వర్షాలు
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీ, తమిళనాడులను భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుపానుగా బలపడి ఏపీలో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మైచౌంగ్‌గా నామకరణం చేసిన ఈ తుపాను డిసెంబర్ 4 లేదా 5వ తేదీన ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని పేర్కొంది. అయితే, ఈ తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ప్రస్తుతం చెప్పలేమని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబర్ 3-5 తేదీల మధ్య దక్షిణ ఒడియా, ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఈ అల్పపీడనం మరింతగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. 

ఈ తుపాను భారత ఆగ్నేయ తీరంపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకూ వర్షపాతం నమోదవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
  

  • Loading...

More Telugu News