State Election Commission: మీ ఓటును వేరేవారు వేస్తే ఇలా చేయండి...!
- 1961లో సెక్షన్ 49(పీ)ని అమల్లోకి తెచ్చిన ఎన్నికల సంఘం
- ముందు ప్రిసైడింగ్ అధికారిని కలవాలి
- ఓటు కోల్పోయిన వారు గుర్తింపు కార్డు లేదా గుర్తింపు పత్రాలు సమర్పించాలి
మన ఓటును వేరేవారు వేస్తే ఏం చేయాలో తెలుసా? ఇందుకోసం భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్ 49(పీ)ని అమలులోకి తీసుకువచ్చింది. మీ ఓటును వేరేవారు వేశారని మీరు గుర్తిస్తే వెంటనే పై సెక్షన్ ద్వారా ఓటును పొందవచ్చు. ముందు ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వారు తామే ఈ హక్కును కోల్పోయామని తొలుత నిరూపించుకోవాలి. అందుకోసం ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించవలసి ఉంటుంది.
ఎన్నారై అయితే పాస్‌పోర్ట్ చూపించాలి. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17(బీ)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి. అప్పుడు టెండర్ బ్యాలెట్ పేపర్‌ను ప్రిసైడింగ్ అధికారి.. ఓటు హక్కు కోల్పోయినవారికి ఇస్తారు. దానిపై నచ్చిన వ్యక్తికి ఓటు వేసి తిరిగి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వవలసి ఉంటుంది. ప్రత్యేక కవరులో ఈ ఓటును భద్రపరిచి కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 49(పీ) ద్వారా పొందే ఓటు హక్కును టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు అంటారు. అయితే ఈ హక్కును వినియోగించుకునే వారు చాలా అరుదు.