Excise CI: నోట్ల కట్టలతో పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐపై వేటు

Excise CI Anjith Rao Suspended

  • సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల జారీ
  • వరంగల్ నుంచి డబ్బు తరలించిన సీఐ
  • చెంగిచెర్ల వద్ద పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

ఎన్నికల వేళ కారులో నోట్లకట్టలతో పట్టుబడిన ఎక్సైజ్ సీఐ అంజిత్ రావుపై వేటు పడింది. హెడ్ క్వార్టర్స్ లో విధుల్లో ఉండాల్సిన సీఐ.. పర్మిషన్ లేకుండా బయటకు వెళ్లడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పెద్ద మొత్తంలో కరెన్సీ తరలించడంపై ఉన్నతాధికారులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ డబ్బు, లిక్కర్ తరలింపును అడ్డుకుంటున్నారు.

ఈ నెల 27 సోమవారం నాడు ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు దాదాపు 6 లక్షలకు పైగా సొమ్ముతో వరంగల్ నుంచి కారులో బయలుదేరాడు. మేడ్చల్ కు వెళుతుండగా చెంగిచెర్ల సమీపంలో ఆయన కారును కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కారులో తనిఖీ చేయగా ఓ సంచీలో నోట్లకట్టలు బయటపడ్డాయి. అందులో అంజిత్ రావు ఐడీ కార్డు కూడా ఉంది. దీంతో సీఐ అంజిత్ ను కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. పోలీసులు అంజిత్ కారును, నోట్ల కట్టలను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News