Girl: పాకిస్థాన్ లో ఘోరం... అబ్బాయిలతో డ్యాన్స్ చేసిందని అమ్మాయి హత్య

Girl murdered by family members in Pakistan
  • కోహిస్థాన్ ప్రాంతంలోని బర్షర్యాల్ గ్రామంలో ఘటన
  • అబ్బాయిలతో కలిసి అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక జిర్గా (పెద్ద మనుషుల మండలి)
  • మరణశిక్ష విధించిన జిర్గా... అమలు చేసిన కుటుంబ సభ్యులు
  • పోలీసులు రావడంతో బతికిపోయిన మరో బాలిక
పాకిస్థాన్ లో ఛాందసవాద భావజాలానికి ఓ అమ్మాయి బలైంది. అబ్బాయిలతో కలిసి డ్యాన్స్ చేసిందని ఓ అమ్మాయిని హత్య చేశారు. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడడం ఘోరం. ఇక్కడి కోహిస్థాన్ ప్రాంతంలోని బర్షర్యాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

18 ఏళ్ల అమ్మాయి కొందరు అబ్బాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాంతో ఆ బాలికపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. స్థానిక 'జిర్గా' (గ్రామ పెద్దల మండలి) సమావేశమై ఆ బాలికకు మరణశిక్ష విధించింది. సొంత కుటుంబీకులే ఆమెకు మరణశిక్ష అమలు చేశారు. 

అయితే, అదే వీడియోలో బాలికతో పాటు మరో అమ్మాయి కూడా డ్యాన్స్ చేసింది. ఆ అమ్మాయికి కూడా 'జిర్గా' మరణశిక్ష విధించినా, సకాలంలో పోలీసులు రావడంతో బతికిపోయింది. కాగా, బాలిక హత్య పాకిస్థాన్ లో ఆగ్రహావేశాలు రగిల్చింది. ఇది పరువు హత్యేనని, ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయాలని చాలామంది గళం విప్పారు. 

అటు, బాలిక హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. బాలికతో పాటు వీడియోలో డ్యాన్స్ చేసిన అబ్బాయిలు దాడుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Girl
Murder
Dance
Video
Jirga
Pakistan

More Telugu News