State Election Commission: ఈసీ నోటీసులపై మంత్రి కేటీఆర్ నుంచి వివరణ అందలేదు: తెలంగాణ సీఈవో వికాస్ రాజ్
- తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్
- ఘర్షణలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు సీఈవో ఆదేశం
- రాజకీయ పార్టీల నుంచి వస్తోన్న ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నట్లు వెల్లడి
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది విజ్ఞప్తులు వచ్చాయన్న వికాస్ రాజ్
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందని, ఆయన నుంచి ఇంకా వివరణ అందలేదని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుందని, ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేయాలని, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. పోటీ తీవ్రంగా ఉన్నచోట ముందస్తు జాగ్రత్తలతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తోన్న ఫిర్యాదులపై తాము వెంటనే స్పందిస్తున్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు. వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది విజ్ఞప్తులు వచ్చాయని, అందులో తొమ్మిదింటికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో రూ.709 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మాజీ అధికారి ఏకే గోయల్ నివాసంలో సోదాలు నిర్వహించామని, కానీ ఏమీ దొరకలేదని స్పష్టం చేశారు.