Russia: షాహెద్ డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడిన రష్యా

Ukraine says Russia launched massive attacks on Kyiv with Shahed drones

  • 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • తాజాగా ఎన్నడూ లేనంత భీకరంగా రష్యా దాడి చేసిందన్న ఉక్రెయిన్ వర్గాలు
  • 75 డ్రోన్లతో విధ్వంసం సృష్టించిందని వెల్లడి
  • తాము 74 డ్రోన్లను కూల్చివేసినట్టు చెప్పుకున్న ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ

ఉక్రెయిన్ పై రష్యా 2022 ఫిబ్రవరిలో దాడులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడింది. ఈ దాడుల కోసం ఇరాన్ తయారీ షాహెద్ డ్రోన్లను రష్యా సైన్యం ఉపయోగించింది. ఈ దాడులను ఉక్రెయిన్ వాయుసేన కమాండర్ మికోలా ఒలెష్చుక్ నిర్ధారించారు. రష్యా బలగాల ప్రధాన లక్ష్యం కీవ్ నగరమేనని వెల్లడించారు. 

కాగా, ఈ దాడుల కోసం రష్యా సైన్యం 75 షాహెద్ డ్రోన్లను రంగంలోకి దించింది. అయితే వాటిలో 74 డ్రోన్లను తాము కూల్చివేశామని ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రకటించుకుంది. 

ఈ దాడులపై కీవ్ నగర పాలకుడు సెర్హీ పోప్కో స్పందించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలయ్యాక ఇంత భీకర స్థాయిలో దాడులు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ఈ దాడుల్లో కీవ్ నగరంలోనే అనేక భవనాలు ధ్వంసం అయ్యాయి. ఐదుగురు పౌరులకు గాయాలయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

17 వేల మంది అంధకారంలో ఉన్నట్టు ఉక్రెయిన్ ఇంధన శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేకువ జామున నాలుగు గంటల నుంచి రష్యా దాడులు జరగ్గా... దాదాపు 6 గంటల పాటు విధ్వంసం కొనసాగినట్టు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News