Naresh: సీనియర్ నటుడు నరేశ్ కు 'సర్' బిరుదు ప్రదానం చేసిన ఐరాస అనుబంధ సంస్థ
- కౌంటర్ టెర్రరిజంపై నరేశ్ ప్రసంగాలు
- అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలు
- ఫిలిప్పీన్స్ లో 5వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశాలు
- నరేశ్ కు విశిష్ట మెడల్ ప్రదానం చేసిన అంబాసిడర్ జనరల్ సర్ దివాకర్ చంద్ర సర్కార్
సీనియర్ నటుడు నరేశ్ మంచి వక్త కూడా. ప్రపంచ సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు, తదితర అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ఉగ్రవాదం అంశంపై ఆయన ప్రసంగాలకు తగిన గుర్తింపు లభించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్ఏఎస్డీపీ), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) ఓ కార్యక్రమంలో నరేశ్ కు సర్ బిరుదును ప్రదానం చేశాయి. ఫిలిప్పీన్స్ లోని క్వెజాన్ నగరంలో జరిగిన 5వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో ఈ బిరుదును అందించారు.
ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా. క్వెజాన్ సిటీలో జరిగిన కార్యక్రమంలో నరేశ్ కు 'సర్' బిరుదుకు సంబంధించిన మెడల్ ను అంబాసిడర్ జనరల్ సర్ దివాకర్ చంద్ర సర్కార్ బహూకరించారు. ఈ ఘనత అనంతరం ఇక నుంచి నరేశ్ పేరు ముందు అంబాసిడర్ లెఫ్టినెంట్ కల్నల్ సర్... అనే హోదా చేరుతుంది.
దీనిపై నరేశ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కౌంటర్ టెర్రరిజం అంశంపై తన ఉపన్యాసాలకు గుర్తింపుగా 'సర్' బిరుదును ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.