Anand Mahindra: ఆనంద్ మహీంద్రా సామాజిక స్పృహ... ఓ వ్యక్తికి జరిమానా

Anand Mahindra tags BMC and caused to impose fine for a man

  • ముంబయి సముద్రంలో చెత్తను పారవేసిన వ్యక్తులు
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో
  • ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ను ట్యాగ్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • చెత్తను పారవేసిన వ్యక్తిని గుర్తించి రూ.10 వేల జరిమానా వేసిన బీఎంసీ

ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో దర్శనమిచ్చింది. ఓ ట్యాక్సీలో వచ్చిన కొందరు వ్యక్తులు ముంబయి సముద్ర తీరంలో వాడిపోయిన పువ్వులు, ఇతర చెత్తను పారవేస్తుండడం ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియోను ఎక్స్ లో ఉజ్వల్ పూరీ అనే నెటిజన్ పోస్టు చేశాడు. "ముంబయి వాళ్లు భలే మంచివాళ్లు!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించాడు. ఆ వీడియో కాస్తా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కంటబడింది. 

ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యకరమైన వీడియోలు, ప్రతిభావంతుల వీడియోలను మాత్రమే కాదు, ఇలాంటి వీడియోలను కూడా ప్రత్యేక దృష్టితో పరిశీలిస్తారు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న ఆనంద్ ఈ వీడియోను తేలిగ్గా తీసుకోలేకపోయారు. 

వెంటనే ముంబయి నగర పాలక సంస్థ బీఎంసీని ట్యాగ్ చేస్తూ వీడియోను రీట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాలు బాగుండడం కాదు... ముందు మన అలవాట్లు మార్చుకోవాలి... అప్పుడు సానుకూల మార్పు వస్తుంది అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్రా అంతటి వ్యక్తి తమను ట్యాగ్ చేయడంతో బీఎంసీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ట్యాక్సీ నెంబరు ఆధారంగా ఆ చెత్తను పారవేసిన వ్యక్తుల్లో ఒకరిని హాజీ అబ్దుల్ రహమాన్ షా ఖాద్రీ అని గుర్తించింది. అతడికి రూ.10 వేల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News