Akbaruddin Owaisi: పోలీసులకు బెదిరింపు... అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు
- కేసు నమోదు చేసిన సంతోష్ నగర్ పోలీసులు
- ఐపీసీ 353 సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
- నిన్న రాత్రి ప్రచార సమయం ముగిసిందన్న పోలీసు అధికారిపై అక్బరుద్దీన్ చిందులు
మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై బుధవారం పోలీస్ కేసు నమోదయింది. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని దూషించినందుకు గాను సంతోష్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 353 (విధులను అడ్డుకోవడం)తో పాటు పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు తెలిపారు. అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం లలితాబాగ్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... సమయం అయిపోయిందని, ప్రచారం ముగించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి కోరారు. దీంతో ఆయన సదరు పోలీసు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన వద్ద కూడా వాచీ ఉందని, ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని, తనను ఆపే వ్యక్తి ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడతానని, ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు. తాను కనుసైగ చేస్తే పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తన పని అయిపోలేదని, తనలో అదే దమ్ము ఉందన్నారు. అక్బరుద్దీన్‌తో పోటీపడేందుకు వస్తున్నారు.. రానీయండి ఎలా గెలుస్తారో చూద్దామన్నారు. పోలీసులను బెదిరించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదయింది.