KCR: ఎన్టీఆర్ రూ.2కి కిలో బియ్యం ఇచ్చేదాకా ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే!: కేసీఆర్

KCR Praja Ashirvada sabha in Alampur

  • ఇందిరమ్మ రాజ్యం తేవాలని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • బీఆర్ఎస్ వచ్చాక పాలమూరులో మారిన పరిస్థితుల్ని గమనించాలన్న కేసీఆర్
  • ప్రజాస్వామ్యంలో గూండాలు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు గెలవకూడదన్న ముఖ్యమంత్రి

బీఆర్ఎస్ వచ్చాక పాలమూరులో మారిన పరిస్థితుల్ని ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అలంపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో గూండాలు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు గెలవకూడదన్నారు. ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అన్నారు. ఇదివరకు పాలమూరు నుంచి అధికంగా వలసలు ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఆర్డీఎస్ నుంచి నీళ్లు తరలించుకుపోతున్నా అప్పుడు ఎవరూ మాట్లాడేవారు కాదన్నారు. పదవుల మీద ఆశతో కాంగ్రెస్ నాయకులు అప్పుడు మాట్లాడలేదన్నారు. వాల్మీకి బోయలను బీసీలలో కలిపింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే వారిని ఎస్టీ జాబితాలో కలుపుతామన్నారు.

కాంగ్రెస్‌ను గెలిపించి మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తేవాలని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, కానీ ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి బతుకులే అన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని మనం చూడలేదా? అన్నారు.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ... రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేదాక ఆకలి బతుకులే కదా? ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులే అన్నారు. అంతకుముందు పేదల బాధలను పట్టించుకున్నది లేదన్నారు. పేదల కడుపును నింపాలని, రైతులకు పొలాలకు నీరివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలేదన్నారు. తెలంగాణను నాశనం చేశారన్నారు. అలంపూర్ నుంచి పార్టీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే కరవు అనేది అలంపూర్ రాకుండా చూసే బాధ్యత తనదే అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కాంగ్రెస్ పెండింగులో పెట్టిందన్నారు.

  • Loading...

More Telugu News